
Home » తెలుగు మహాసభల చరిత్ర » మూడవ ప్రపంచ తెలుగు మహాసభల నివేదిక
| మూడవ ప్రపంచ తెలుగు మహాసభల నివేదిక | ||
రెండవ ప్రపంచ తెలుగు మహాసభల తీర్మానం మేరకు 1990 మారిషస్ దేశంలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఈ సభలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ద్వారా ఆ దేశంలోని మారిషస్ ఆంధ్ర మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించింది. ఇవి 1990 డిశంబర్ 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మారిషస్‌లోని మోకా ప్రాంతంలో ఉన్న 'మహత్మా గాంధి ఇన్‌స్టిట్యూట్' లో నిర్వహించబడ్డాయి. ఈ మహాసభల ప్రారంభోత్సవానికి మారిషస్ గవర్నర్ జనరల్ సర్ వీరాస్వామి రింగడు, ఆ దేశ ప్రధాని సర్ అనిరుధ్ జగన్నాథ్ ముఖ్య అతిథులుగా విచ్చేసారు. వీరు ఉత్సవాలను ప్రారంభిస్తూ భారతదేశంతో మారిషస్ దేశానికి ఉన్న సత్సంబంధాలను వివరించారు. ముఖ్యంగా తెలుగు వారు మారిషస్ దేశ ప్రగతికి, ఉన్నతికి కృషి చేసిన వారని ప్రశంసించారు. తెలుగు విశ్వవిద్యాలయం అప్పటి ఉపాధ్యక్షులు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డా॥ సి.నారాయణ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యావేత్తలు, మేధావులు, కవులు, కళాకారులు, చలనచిత్ర నటులు, అధికారులు బృందంగా ఏర్పడి ఈ సభలకు హాజరై వీటిని జయప్రదంగా నిర్వహింపచేసారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సభలలో మాతృభాషగా తెలుగు బోధన, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, ఇత్యాది అంశాలపై విద్వద్గోష్ఠులు, కవి సమ్మేళనాలు, ప్రతినిధుల సమావేశాలు చైతన్యవంతంగా నిర్వహించబడ్డాయి. సుమారు 200 సంవత్సరాలకు పూర్వం తెలుగునాట తీర ప్రాంతాల నుంచి వెళ్ళిన తెలుగువారు కొన్ని తరాలుగా ఆ దేశంలో స్థిరపడిపోయారు. వారికి ఇక్కడి నుంచి ఎటువంటి రాకపోకలు లేకపోవడం వల్ల ఇన్నాళ్లుగా తెలుగు భాషాసంస్కృతులకు దూరంగా జీవిస్తున్నారు. అయినప్పటికీ వీటిని తమ తాత ముత్తాతల సంపదగా భావించి, ఆరాధిస్తూ దానిని తరువాతి తరాలకు అందిస్తూ తెలుగు ఉనికిని కాపాడుకుంటున్నారు. అటువంటి తెలుగు వారికి ఈ సభలు తెలుగు భాషపై నరనరాలలో ఉన్న మమకారాన్ని వెల్లువెత్తించాయి. ఈ సందర్భంగా ఉత్తమ రచనలతో కూడిన ఒక ప్రత్యేక సంచిక ఆవిష్కృతమయ్యింది. ప్రపంచ తెలుగు మహాసభల చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిపోయిన ఈ మూడు ప్రపంచ తెలుగు మహాసభలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయంగా నిర్వహించినవి. అనంతరం ఈ చైతన్యంతో దేశ విదేశాలలోని తెలుగు వారు ఎందరో తెలుగు మహాసభలను నిర్వహించారు. అలా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మహాసభల సంప్రదాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల ముంగిట్లో ఉన్నాం. ఈ సభలు తిరుపతిలో 2012 డిశంబర్ 27,28,29 తేదీలలో జరుగనున్నాయి. |
||
![]() |
||












